నేటి నుంచి వైఎస్ జగన్ జలదీక్ష♦ మూడ్రోజులు నిరాహారదీక్ష
♦ కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు ప్రతిఘటన..

 కర్నూలు నుంచి సాక్షి ప్రతినిధి:
 కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు కర్నూలులో నిరవధిక నిరాహారదీక్ష చేయడానికి రంగం సిద్ధం అయింది. నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో దీక్షా వేదికపై ఆయన సోమవారం ఉదయం తన నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది.

ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిష్క్రియాపరత్వంపై నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ప్రజల ఆక్రందనలను వినిపించేందుకు జగన్ ఈ నిరాహారదీక్షకు పూనుకుంటున్నారు. 16న జగన్ మూడు రోజుల నిరాహారదీక్ష ప్రారంభం కానుండగా మరుసటి రోజైన 17వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో జలదీక్ష చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

 ఉదయానికి కర్నూలు చేరుకోనున్న జగన్
 మూడు రోజుల నిరాహారదీక్ష చేయనున్న జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు దీక్షా వేదికకు చేరుకుంటారు. దీక్షకు వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారమే కర్నూలుకు చేరుకుని జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డితో ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు వై.ఐజయ్య, వై.విశ్వేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డి తదితరులు కూడా దీక్షాస్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Top